ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకు జరగనున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభం అయింది. ఈరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి శాసనసభ ఘనంగా నివాళులు అర్పించింది. సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. గౌతంరెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని సీఎంతో సహా ఇతర మంత్రులు గుర్తు చేసుకున్నారు. నెల్లూర్ లోని సంగం బ్యారేజీకి ‘ మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉంటే… ఏపీ అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. మంత్రి గౌతంరెడ్డి మరణానికి సంతాపంగా రేపు మార్చి 9న సభ జరగదు. మళ్లీ ఎల్లుండి సభ సమావేశం కానుంది. 10వ తేదీన తిరిగి సమావేశమయ్యే సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాణ ప్రవేశపెట్టి..చర్చ జరపనున్నారు. 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత 12,13 తేదీల్లో శాసన సభకు సెలవు ఉంటుంది. 14న సభ ప్రారంభం అయి 17 వరకు కొనసాగుతుంది. 18న హోలీ..19,20 శని, ఆదివారాలు వరసగా సెలవులు రానున్నాయి. తిరిగి సభ ఈనెల 21న ప్రారంభం కానుండగా..25న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.