మొదట ప్రభుత్వం అనుకున్నది వేరు..తరువాత ప్రభుత్వం నిర్థారించి, అడిగింది వేరు. అప్పుల్లో మునిగాక కేంద్రం మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి అని ఓ వాదన విపక్షం నుంచి వినిపిస్తున్న తరుణాన కొన్ని కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. అసలు రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత.? 2.56 లక్షల కోట్ల బడ్జెట్ట్ అన్నది ఇక్కడ అమలుకు నోచుకుంటుందా..? అసలు బుగ్గన ఆర్థిక స్థితి గతులు అంచనా వేసే ఇలాంటివేవో చెప్పారా? ఇలాంటివే ఇప్పుడు కూడా రేగుతున్న ప్రశ్నలు.
కానీ వీటికి సమాధానాలు లేవు. వీటికో స్పష్టత కూడా లేదు. ఎందుకంటే ఓ లెక్క ప్రకారం ఎంత చూసుకున్నా రాష్ట్ర ఆదాయం అన్ని విధాల బాగుంటే 66 వేల కోట్ల రూపాయలు.. కేంద్రం సాయం అన్నీ కలుపుకున్నా లక్ష కోట్లు ఏమీ దాటిపోదు. మన దగ్గర విదేశీ పెట్టుబడులు లేవు. అదేవిధంగా కొన్నిసార్లు విదేశీ రుణాలకు ప్రయత్నించినా ఆర్బీఐ అడ్డుకుని, జగన్ ఆశలపై నీళ్లు జల్లింది. ఓ విధంగా ఎలా చూసుకున్నా ఏపీది గొంతెమ్మ కోర్కెలు.
“మనం డబ్బులు పంచుతున్నాం.. మనకు ఎలా అయినా మళ్లీ అధికారం రావాలి.. ఎందుకు 151 సీట్లు 175 సీట్లూ మనవే ఎందుకు కాకూడదు ” అని యువ ముఖ్యమంత్రి జగన్ తరుచూ చెబుతున్నారు. బాగుంది. సంక్షేమానికే నిధులు అన్నీ ఇస్తే.. ఏటా 55వేల కోట్ల రూపాయల మేరకు సంక్షేమం కోసం వెచ్చిస్తున్న ధనిక రాష్ట్రం ఏపీది. అలానే ఇదే సమయాన ఏ అభివృద్ధీ లేని రాష్ట్రం కూడా ఆంధ్రానే ! ఆ రోజు చంద్రబాబు కొంతలో కొంత మెరుగయిన రీతిలోనే తన ఆర్థిక శకంను ముగించారు. అలా అని ఆ రోజు దుబారా లేదని, అంతా పెర్ఫెక్ట్ అని చెప్పలేం కానీ ఐదేళ్ల కాల గతికి మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు.
రాష్ట్రం విడిపోయిన సమయానికి మన అప్పును కేంద్రం ఏమీ క్లియర్ చేయలేదు. అప్పుడు అప్పు లక్ష కోట్లు. తెలంగాణ ప్రభుత్వం ఓ దశలో ఆంధ్రాకు సాయం చేయాలని అనుకున్నా ఓ వెయ్యి కోట్లు ఇద్దాం అని అనుకున్నా అది కూడా కాలేదు. రాష్ట్రం విడిపోయాక, పుట్టెడు దుఃఖంలో కూడా ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలు చాలానే తీర్చారు చంద్రబాబు. ఆ రోజు ఆయనకు
ఆ విధంగా చేయక తప్పలేదు. తరువాత పరిణామాల నేపథ్యంలో జగన్ కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయ్యారు.
ఆ విధంగా ఆయన ఇప్పటికిప్పుడు ఉన్న కష్టాల కొలిమి నుంచి బయటపడేందుకు కేంద్రానికి 71 వేల కోట్ల రూపాయలు అప్పు రూపేణా అడిగారు. తరువాత 61 వేల కోట్ల రూపాయలకు తన ప్రతిపాదనలను సవరించి పంపారు. 3నెలల సంప్రదింపుల తరువాత అంటే గత ఆర్థిక సంవత్సం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం అయినా కూడా మన ఏపీలో ఏ మార్పూ లేదు.
అందుకే ఏపీకి అప్పు ఇవ్వడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. ముఖ్యంగా సంక్షేమ పథకాల నిర్వహణకు ఏ బ్యాంకూ అప్పులు ఇవ్వదని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆస్తుల తనాఖాతోనే కొంత వరకూ ఆయన నెట్టుకు వస్తున్నారు.తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీకి 28 వేల కోట్ల రూపాయల మేరకు అప్పు ఇవ్వాలన్నది కేంద్రం ఇచ్చిన అంగీకారం.. ఇదొక్కటే
జగన్-కు ఉపశమనం ఇచ్చే పరిణామం.