నింద కొంత.. నిజం కొంత.. నడుస్తున్న పరిణామాల్లో వాస్తవాలు నిర్థారణలో ఉంటే.. ఎవరు ఎటు అన్నది తేలిపోతుంది.
ఏపీ మంత్రులు చెబుతున్న విధంగా సామాజిక న్యాయం సాధ్యం అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా వెతకాలి. ఎన్టీఆర్ హయాం నుంచి అంతకుముందరి పాలకుల కాలం నుంచి వినిపిస్తున్న ఈ పదం సంపన్న వర్గాల నుంచి వినిపిస్తోంది. సామాజిక వర్గాల పరంగా చాలా మంది వెనుకబాటును రాజకీయ అధికారం ప్రశ్నించింది. తరువాత రాజ్యాధికారం దక్కించుకున్న వర్గాలు తమ ని తాము కాపాడుకుంటూ తమకు చెందిన వర్గాలను కాపాడుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా అవి ఆ పని చేశాయి. కనుక అధికారం కొత్త ముఖాలకు దక్కడం లేదు. కొత్త ముఖాలకు దక్కినా పాలనకు సంబంధించిన మెచ్చూర్డ్ మెంటాలిటీ వారిలో ఇంకా రావడం లేదు. పరిపక్వ ధోరణి లేని కారణంగా కొందరు, పాలనపై స్పష్టమైన అవగాహన లేక కొందరు కేవలం బీసీ కార్డుతో పదవులు పొందాక సిసలు వెనుకబాటులో ఉండిపోతున్నారు. ఈ దశలో సామాజిక న్యాయ భేరి లాంటి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తాయా ?
సామాజిక న్యాయం మాతోనే సాధ్యం అని వైసీపీ అంటోంది. ఆ దిశగా మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇవాళ్టికీ ఆ పదం విషయమై అర్థం తెలియని వారు ఎందరో ! పింఛను అందించడం సామాజిక బాధ్యత అవుతుంది. సామాన్య కుటుంబాలకు అందరికీ అది చేరితే, అర్హత మేరకు అన్నీ అందితే అది సామాజిక న్యాయం అవుతుంది. స్ఫూర్తిపరంగా ఎవరికి వారు రాణించాలి. తమ వారిని ఉద్దేశించి బాగు చేయాలన్న కోరిక తెలుగు నేలపై ఉన్న ఎవ్వరికీ అనగా ఏ నాయకులకూ లేదు. పదవుల పరంగా ఆ రోజు కానీ ఈ రోజు అవి అలంకారం అవుతున్నాయి అన్న విమర్శను అటు టీడీపీ ఇటు వైసీపీ మోస్తూనే ఉంది. ఈ నింద చెరిగిపోతే మంచిపాలన అన్నది అందించిన దాఖలాలు వైసీపీ కోటాలోకి తప్పక చేరుతాయి.