రెండంటే రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీటిపై జగన్ కు స్పష్టత ఉంది. ఒకటి తాగునీటి సమస్యలను పరిష్కరించడం. రెండు సాగునీటి పనులను వేగవంతం చేయడం. ఈ రెండూ ఫలితాలు ఇవ్వకపోతే జగన కు రానున్న కాలంలో కష్ట కాలమే అన్నది ఇప్పటికే ఓ నివేదిక అందింది. గ్రామాల్లో కనీస స్థాయిలో కొన్ని సమస్య లు పరిష్కరించాకే మంచి పాలనకు అర్థం ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఇదే ఇప్పుడు జగన్ లో వచ్చిన కొద్దిపాటి కీలక మార్పునకు కారణం. మండు వేసవిలో ఏటా తాగునీరు లేక శుద్ధజలం అందించే వారు లేక అవస్థలు పడే గ్రామాలు ఎన్నో !
ప్రభుత్వాలు మారినా సమస్యల పరిష్కారం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇదే ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు ఓ పెను ఉత్పాతంగానూ మారనుంది. రాష్ట్రంలో గతంలో కన్నా ఇప్పుడు తాగునీటి పథకాల నిర్వహణ అన్నది వెనుకంజలో ఉంది. వీటి నిర్వహణకు నిధులు లేవు. కనుక త్వరలోనే పంచాయతీలకు నిధులు ఇచ్చి సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు జగన్ యోచిస్తూ ఉన్నారు. ఇదే సమయాన పెండింగ్ పనులను కొన్ని ఉపాధి పథకం ద్వారా పూర్తిచేయించేందుకు, సంబంధిత బిల్లులు చెల్లించేందుకు కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే చెరువుల అనుసంధానం సాధ్యం. అదే ఆయన లక్ష్యం కూడా !
పాలనను వేగవంతం చేయడం.. మంచి ఫలితాలు అందుకోవడం ఇవే ప్రధాన లక్ష్యాలుగా సాగిపోతున్న జగన్ కు మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఇప్పుడిప్పుడే వస్తుంది. మూడేళ్ల లో సంక్షేమ పథకాలపై పూర్తి దృష్టిసారించిన జగన్ ఇకపై తన పంథాను మార్చుకుని, కాస్త అభివృద్ధిపై కూడా దృష్టి నిలపాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్ టాక్ అవుతోంది. పొలిటికల్ సర్కిల్స్ లో జగన్ ను ఎవ్వరూ అంచనావేయలేరు. ఆయన ఎంతటి వారిని అయినా తన అంచనాలకు మరియు ప్రజల అంచనాలకు అనుగుణంగా లేకపోతే తీసి పక్కనపెడతారు. ఆ విషయమై కొడాలి నాని, పేర్ని నాని ఇంకా ఇంకొందరు మాజీలే ఉదాహరణలు. వివాదాలను మాత్రం ఆయన అస్సలు భరించరు. ఎంటర్టైన్ చేయరు.
ఆ విధంగా జగన్ ఇప్పుడు కొత్త మంత్రి వర్గ సభ్యులతో పరుగులు తీయించేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలో జిల్లాల పర్యటనలకు ఆయన రానున్నారు. ఇదే సందర్భంలో ఆయన దృష్టికి కొన్ని సమస్యలు రానున్నాయి. వీటిపై ముందుగానే ఓ అంచనాకు వచ్చిన ఆయన తాగునీరు మరియు సాగు నీరు సంబంధిత సమస్యలను సాల్వ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చెరువుల అనుసంధానతకు శ్రీకారం దిద్దనున్నారు. చెరువులను కాలువలకు, ఫీడర్ ఛానెళ్లకు అనుసంధానం చేసే పనులు చకచకా చేపట్టాలని నిన్నటి వేళ అధికారులను ఆదేశించారు.