ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. హైస్కూల్ విద్యార్ధుల అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్ధులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరు లోగా విద్యార్ధులందరిని యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది.
డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లోనూ ఇదే తరహాలో అటెండెన్స్ తీసుకోనున్నారు అధికారులు. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జియో ట్యాగింగ్ సాంకేతికత ద్వారా ఆయా కాలేజీల్లో మాత్రమే యాప్ పనిచేసే విధంగా యాప్ డిజైన్ చేసింది ప్రభుత్వం. కేవలం రెండు నిమిషాల్లోనే విద్యార్ధుల హాజరు నమోదు చేసేలా యాప్ రూపొందించినట్లుగా తెలుస్తోంది.