ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల శాఖలతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15 వ తేదీ లోగా డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని అధికారులకు చెప్పారు సీఎం జగన్. పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు సీఎం జగన్. అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అందించనున్నట్లు సీఎం వివరించారు.
ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతున్నట్లు, ఇంకా అక్కడక్కడా నాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. గడిచిన మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పకడ్బందీగా సోషల్ ఆడిట్ పూర్తి చేయాలి. నిర్దేశించిన గడువు ప్రకారం పని పూర్తి చేయాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నాం. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలతో సహా వీటన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నాం. గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా అవసరమైన మేరకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలపైనా దృష్టి పెట్టాలి. ఈ విషయంలో ఎగుమతులు రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలి.