ఏపీనేతలు మౌన మునులు… తేలు కుట్టిన దొంగలు?

-

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేట్ పరం కాబోతుంది! ఈ విషయంలో రాష్ట్రంలో రాజకీయంగా బలమైన ఒత్తిడి లేదనో.. లేక, అన్ని రాజకీయ పక్షాలు మౌనంగా ఉన్నాయనో.. అదీగాక, మోడీ మార్కు “ప్రైవేటీకరణ”లో భాగమో తెలియదు కానీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇకపై ప్రైవేటు సంస్థ కాబోతుంది! మరి ఏపీ ప్రభుత్వం ఏమి చేస్తుంది? ప్రధాన ప్రతిపక్షం మౌనవ్రతం ఎందుకు పాటిస్తుంది? బీజేపీ మిత్రపక్షం జనసేన తేలుకుట్టినట్లుగా ఎందుకు వ్యవహరిస్తుంది?

visakha steel plant issue

మోడీ మార్కు అరాచకం:

విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ప్రభుత్వ వాటా ఉపసంహరణ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖరాసిన సంగతిని ప్రస్తావిస్తూ.. విజయసాయి రెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా… “విశాఖ స్టీల్‌ ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్ని సాధ్యమైతే ప్రైవేటీకరించడం.. లేనిపక్షంలో శాశ్వతంగా ముూసివేయడమే కొత్త పబ్లిక్ సెక్టార్ విధానం” అని కేంద్రం స్పష్టం చేసింది!

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే విషయంలో మోడీ అత్యుత్సాహం తెలియంది కాదు! అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ల కనుసన్నల్లో మోడీ బ్రతుకుతున్నాడనే పేరు సోషల్ మీడియాల్లో కూడా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే! మరి ఈ పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్ ను కాపాడుకోవడం ఎలా? 6,300 కోట్లకుపైగా లాభం వస్తున్న విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆపడం ఎలా? ఆంధ్రుల హక్కుని నిలుపుకోవడం ఎలా?

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటం:

ఈ అంశంపై తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటం తీవ్రతరం చేసింది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణలో భాగంగా ట్రాన్జాక్షన్‌, లీగల్‌ అడ్వైజర్ల నియామకాల ప్రక్రియను పునఃప్రారంభించడంపై.. ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు నిరసన తెలిపారు. కానీ… ఆ నిరసన సరిపోతుందా.. వారి నిరసనకు రాజకీయపార్టీల నుంచి మద్దతు అవసరంలేదా?

కమ్యునిస్టుల పాదయాత్ర:

కమ్యునిస్టులు, ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని అనంతపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. విశాఖలో భారీ సభకు రంగం సిద్దం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతిస్తున్నా… మోడీని కదిలించగలదా.. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా ఆపగలదా అన్నది పెద్ద ప్రశ్న!

జనాల నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోవాల్సిన సమయం:

ప్రస్తుతం ఈ విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది! కేంద్రంలో ప్రభుత్వానికి అంశాలవారీగా ఉభయ సభల్లోనూ మద్దతిస్తున్న వైకాపా ప్రభుత్వం.. కేవలం లేఖలు రాసి సరిపెట్టి చేతులు దులుపుకోవాలని భావిస్తే.. అంతకు మించిన ద్రోహం మరొకటి ఉండదు! 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ను జనం ఏ రేంజ్ లో నమ్మారన్నది తెలియంది కాదు. మరి ఆ నమ్మకాన్ని జగన్ తనకున్న 23మంది ఎంపీలతో కేంద్రంలోని మిగిలిన పక్షాలను కలుపుకుని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

చంద్రబాబు చక్రాలు తిప్పాల్సిన సమయం:

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాను, రాష్ట్రపతుల నియామకాల్లో నిర్ణయాలు తీసుకున్నాను అన్న రేంజ్ లో మాట్లాడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. ఈ విషయాలపై మౌనంగా ఉంటే.. అది జాతికి చేసిన తీవ్ర ద్రోహంగానే పరిగణలోకి తీసుకోవాలి! ఈ సమయంలో ఆయన వైఖరి ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతం ఇక్కడ కుదరనే కుదరదన్న విషయం బాబు & కో గ్రహించాలి! గతంలో తాను నిజంగా కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పారా లేదా అన్నసంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ సమయంలో మాత్రం కచ్చితంగా తిప్పాలి!

జనసేన వైఖరి రాజకీయ స్నేహమా.. రాష్ట్రమా:

ఇక బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ అంశంపై తమ పార్టీ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. గాజువాకలో ఓడించారని ఉత్తరాంధ్ర ప్రజలమీద, రాష్ట్రం మొత్తం డిపాజిట్లు గల్లంతుచేశారని రాష్ట్ర ప్రజల మీద అలిగి.. మౌనంగా ఉంటే మాత్రం అది జనసేనకు రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది! పవన్ కల్యాణ్ కు ప్రధాని మోడీ అత్యంత గౌరవం ఇస్తారని, ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకుంటున్న తరుణంలో.. ఈ విషయాలపై పవన్ కచ్చితంగా గట్టి నిర్ణయమే తీసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది!

మరి ఈ విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ప్రధాన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తాయా.. పోనీ, విడివిడిగా అయినా తమ నిరసనను కేంద్రప్రభుత్వానికి తెలియజేస్తాయా.. లేకపోతే… రాష్ట్ర విభజన సమయంలో చేసినట్లుగా ఏపీ వాసులకు మరోసారి తీవ్ర అన్యాయం చేస్తాయా.. మోడీపేరు చెబితే తడిపేసుకుంటాయా.. తేలుకుట్టిన దొంగల్లా మిగిలిపోతాయా అన్నది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news