ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 4న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించబోతున్నట్టు, పరీక్షలు పూర్తయిన 25 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. మరోవైపు ఫలితాల తరువాత విద్యాసంస్థలు ర్యాంకులకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నెంబర్ జీవో జారీ చేశారు.గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.