ఢిల్లీలో సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర పర్యవరణ అటవీ శాఖ మంత్రి జవదేకర్‌ను జగన్ కలవనున్నారు. 4 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను, రాత్రి 9 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షాను జగన్ కలనున్నారు.

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎంపీ రఘురామ వ్యవహారం, పోలవరం, ఇతర అంశాలపై కేంద్రమంత్రులతో  జగన్ చర్చించనున్నారు. సీఎం జగన్‌తో పాటు ఎంపీ,అయోధ్య రామిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు కూడా కేంద్రమంత్రులతో సమావేశంకానున్నారు.

కాగా ఢిల్లీ బయల్దేరే ముందు సీఎం జగన్ విజయవాడ తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. పర్యటన అనంతరం ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ చేరుకుంటారు.