గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ‘ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డుల నియామకాలు చేపట్టాలి. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో పోలీసులను ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించుకోవాలి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అప్గ్రేడ్ చేయాలి. పార్కింగ్ సమస్యను అధిగమించేలా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని సూచించారు.రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలు పరిశీలించాలని ఆయన సూచించారు.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమీషనర్లు నెలకోసారి సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని కోరారు.