టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున నర్సీపట్నంలోని ఆయన ఇంటిలో ఆయనను, ఆయన కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేశారు. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌ను టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న, రాజేశ్‌లను సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది బీసీలపై దాడి తప్ప మరోటి కాదన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడడాన్ని ఘోరంగా, ప్రజల హక్కులను పరిరక్షించే ప్రయత్నాన్ని ద్రోహంగా భావిస్తున్న ప్రభుత్వం తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించి హింసిస్తోందన్నారు.
జగన్ మార్కు దురాగతాలు, ఫాసిస్టు పాలనకు ఇది నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనా విధ్వంసం అంతులేనిదని ధ్వజమెత్తారు అచ్చెన్నాయుడు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ మరో నేత ఆలపాటి రాజా అన్నారు. అర్ధరాత్రి వేళ గోడదూకి ఇంటికి వచ్చి అయ్యన్నను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జగన్ శాడిజానికి ఇది నిదర్శమని అన్నారు. సీఐడీ పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యంలా మారారని అన్నారు. రౌడీల్లా మద్యం తాగి ఇళ్లలోకి జొరబడడం, బూతులు తిట్టడం నీచాతినీచమని అన్నారు. రాష్ట్రంలో పెయిడ్ టెర్రరిజం నడుస్తోందని, ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తాను జైలు పక్షిని కావడంతో అందరినీ జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.