ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఆత్మకూరు వాకిట రెండంటే రెండు పార్టీలు బరిలో క్రియాశీలకంగా ఉన్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ అన్నవిధంగానే పోటీ ఉంది.అయితే గెలుపు మాత్రం భారీ మెజార్టీతో వైసీపీనే వరించింది. ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేక బీజేపీ పరువు పోగొట్టుకుంది. టీడీపీ, జనసేన పోటీలో లేకపోయినా కూడా ఆ పాటి ఓట్లతోనే సర్దుకుపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి రావాలనుకుంటున్నది అని వైసీపీ సెటైర్లు వేస్తోంది. పొద్దున లేస్తే చాలు తమను ఓ స్థాయిలో విమర్శించే పార్టీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపకపోవడం నిజంగానే
ఆ పార్టీ కి జనాకర్షణ ఏ పాటి కూడా లేదని సంకేతం అని అంటోంది బీజేపీని ఉద్దేశించి వైసీపీ.
ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుకున్నవిధంగా ఫలితాలు సాధించిందా? అంటే కొంత వరకూ అన్న సమాధానమే వస్తోంది. డిపాజిట్లు రాకున్నా అనుకున్న స్థాయిలో ఓట్లు పడకున్నా కాస్తో కూస్తో ఓట్లు అయితే వచ్చాయని సరిపెట్టుకోవాల్సిందే ! పోలింగ్ శాతం గతంతో పోలిస్తే తక్కువగా ఉండడమే వైసీపీ అనుకున్న విధంగా లక్ష ఓట్ల మెజార్టీని అందుకోలేకపోయింది అని అంటున్నారు అక్కడి నాయకులు. ఏదేమయినప్పటికీ ఈ సారీ ఓట్లు బీజేపీకి, బీఎస్పీకీ, నోటాకి కూడా పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్‌లో కూడా బీజేపీకి కొద్దిపాటి ఓట్లు పోల్ అయ్యాయి. ఆ ఓట్లన్నీ టీడీపీకి పడాల్సినవే అని, ఆ పార్టీ బరిలో లేకపోవడంతో మరొకరికి పడ్డాయని పరిశీలకులు అంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో నోటాకి 4,197 ఓట్లు పడ్డాయి. బీఎస్పీకి 4,897 ఓట్లు, బీజేపీకి 19,332 ఓట్లు వచ్చాయి.
ఇక రాష్ట్రంలో బీజేపీ – టీడీపీ కూటమి పనిచేయనుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలా అయితే ఫలితాలపై ప్రభావం బాగుంటుందని కూడా అనుకుంటున్నారు. అదే విషయమై తర్జన, భర్జనలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒంటరి పోరు చేస్తే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ తమను విమర్శించడం అన్నది తగని పని అని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ ఆత్మ విశ్వాసం పెరిగిందని కూడా అంటోంది. ఇకపై మరింత శ్రద్ధగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన ఓటర్లకు నిన్నటి వేళ అక్కడి నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.