ఇప్పుడు ఏపీలో జనసేన టార్గెట్ ఒక్కటే…పవన్ కల్యాణ్ ని సీఎం చేయడం..ఇప్పటికే టీడీపీ, వైసీపీలకు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు…కాబట్టి తమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి..ఈ విషయంలో పవన్ కూడా అదే మాట మీద ఉన్నారు…తమకు ఛాన్స్ ఇస్తే పాలన ఏంటో చూపిస్తామని అంటున్నారు. అదే సమయంలో టీడీపీతో గాని పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అటు పవన్ సైతం పరోక్షంగా ఇప్పటివరకు తగ్గుతూ వచ్చామని, ఈ సారి తాము తగ్గమని అంటున్నారు. పైగా ఇటీవల ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పి, టీడీపీతో పొత్తు ఉండదన్నట్లు మాట్లాడారు.
సరే అంతా బాగానే ఉంది…చంద్రబాబు, జగన్ సీఎంలు అయ్యారు…పవన్ అయితే తప్పు లేదు…సీఎం పదవి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని సాధించడంలోనే అంతా ఉంది. ఎందుకంటే మెజారిటీ ప్రజల మద్ధతు పొందడం అనేది ఈజీ కాదు. ప్రజలని ఆకర్షించేలా రాజకీయం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ, వైసీపీ కంటే జనసేన బెస్ట్ అని చూపించాలి. అలాగే బలంగా ఉన్న టీడీపీ, వైసీపీల బలం తగ్గించాలి…అదేవిధంగా జనసేన బలం పెంచాలి. అప్పుడే సీఎం పదవి అనేది దక్కుతుంది.
మరి ఆ దిశగా పవన్ గాని, జనసేన శ్రేణులు గాని పనిచేస్తున్నాయా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం తప్ప…పూర్తిగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయి…ఇటీవల సర్వేల్లో ఇంకో రెండు శాతం పెరిగి 8 శాతానికి చేరుకుందని అంటున్నారు. కానీ అటు వైసీపీ, టీడీపీలు 40 శాతంపైనే ఓట్ల బలంతో ఉన్నాయి.
మరి అలాంటప్పుడు జనసేన అధికారంలోకి వచ్చేది ఎలా..పవన్ సీఎం అయ్యేది ఎలా? అసలు పార్టీలోకి వేరే పార్టీ నేతలే రావడం లేదు. బలమైన నాయకులని పార్టీలోకి తీసుకునే కార్యక్రమాలు చేయడం లేదు. పోనీ నియోజకవర్గ స్థాయిలో వైసీపీ-టీడీపీలకు పోటీగా జనసేనలో కొత్తగా బలమైన నాయకులని తయారు చేయడం లేదు. మరి అలాంటప్పుడు పవన్ సీఎం ఎలా అవుతారు..పైగా పొత్తు ఉంటే టీడీపీని ఎలా డిమాండ్ చేయగలరు. కాబట్టి ముందు జనసేన బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఏదైనా జరుగుతుంది.