బాబు-పవన్..మాకిదేం ఖర్మ బాబూ..!

-

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వైఫల్యాలని ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం వల్ల ప్రజల పరిస్తితి దారుణంగా అయిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వెస్ట్ గోదావరిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా ఓ రేంజ్‌లో బాబుపై సెటైర్ వేశారు. పనిలో పనిగా పవన్‌ని కూడా కలిపేసి విమర్శించారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు టూరిస్టుల్లా వస్తున్నారు ‘ఇదేం ఖర్మరా.. బాబూ’ అని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారని అన్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత మళ్లీ చివరి ఛాన్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అని అంటుంటే.. రాష్ట్ర ప్రజలు ఇదేమి ఖర్మరా బాబు..అని అంటున్నారని విమర్శించారు.

గత ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి తప్పుచేశామని ప్రజలు అనుకుంటున్నారని, ఈ సారి చంద్రబాబుని తరిమేస్తారని రోజా ఘాటుగా స్పందించారు. ఇక యథావిధిగానే జగన్‌ని పొగిడే కార్యక్రమం చేశారు. అన్నీ వర్గాల ప్రజలకు జగన్ న్యాయం చేస్తున్నారని, బాబూ లాంటి మోసకారిని మళ్ళీ ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు.

అయితే రోజాకు కూడా అదే స్థాయిలో టీడీపీ, జనసేన నుంచి కౌంటర్లు వస్తున్నాయి. అసలు మంత్రి పదవి అంటే చంద్రబాబు, పవన్‌లని తిట్టడానికేనా..అసలు ఇలాంటి మంత్రి ఉండటం ఇదేం ఖర్మ మనకు అని ప్రజలు అనుకుంటున్నారని, ఇక ప్రతిపక్షంల ఉన్నపుడు జగన్ హైదరాబాద్‌లోనే ఉన్న విషయం రోజా మర్చిపోయారని, చివరిలోనే పాదయాత్ర పేరుతో జనంలో ఉన్నారని, అప్పుడు కూడా మధ్యలో హైదరాబాద్‌కు వెళ్లిపోయేవారని గుర్తు చేస్తున్నారు. మీరు చేసింది గుర్తు ఉండదు..మళ్ళీ ఎదుట వాళ్ళ మీద నిందలు వేయడంలో వైసీపీ వాళ్ళు ముందు ఉంటారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news