నిన్న తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏం చేసింది ? టిఆర్ఎస్ ది కుటుంబ పాలన అంటున్న పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సిందియా, వసుంధర రాజే, బీవై విజయేంద్ర, వరుణ్ గాంధీ ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసిన కేటీఆర్ తెలంగాణ పాలనలో భాగస్వాములు కావొద్దంటా? ఎలాంటి పోరాటం చేయని బీజేపీ నేతలు రాజకీయాల్లో కొనసాగొచ్చా ? అని నిలదీశారు.
అమిత్ షా కొడుకు ఒక్క రోజు కూడా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడని వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడుగా కొనసాగొచ్చా? గురివింద గింజ వంటి సామెత చందంగా బీజేపీ వ్యవహారాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 80 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని.. స్టేట్ జిఎడిపిలో 27 శాతం మాత్రమే అప్పులు చేశామన్నారు. దేశంలో సొమ్మంతా ఆదాని, అంబానీల దగ్గర ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్ర అప్పులు కాళేశ్వరం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాల్లో కనిపిస్తాయని వెల్లడించారు.