మునుగోడు ఉప ఎన్నిక రోజు రోజుకు వేడెక్కుతోంది. ఓటర్లను తమ వైపుకు మళ్లించుకునేందుకు పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అయితే.. తాజాగా నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రచారంలో పాల్గొని.. మాట్లాడుతూ.. “మునుగోడులో గొల్ల కురుమలకు గొర్ల పైసలు అడ్డుకున్నట్లు, నేను ఈసీకి లేఖ రాసినట్లు టీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేస్తున్నరు. నేను గొర్ల పైసలు అడ్డుకోలేదు. పేదలకు వచ్చే పథకాలను అడ్డుకునే తత్వం కాదు నాది. ఈ విషయంపై తడిబట్టలతో నా భార్యా పిల్లలతో కలిసి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా.. నువ్వు సిద్ధమా?” అని సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్‌లో కూడా తాను దళిత బంధు ఆపినట్లు, ఈసీకి లేఖ రాసినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు ఓటర్లతో ఆదివారం నాగోల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. మునుగోడులో ధర్మయుద్ధం జరుగుతోందన్నారు బండి సంజయ్.
“పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలకు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయండి’’ అని సూచించారు బండి సంజయ్. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందని, టీఆర్ఎస్ ఇచ్చే నిధులతోనే కాంగ్రెస్ మునుగోడు బైపోల్ ప్రచారం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నాయని, టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చెల్లని రూపాయని, ఇక్కడ ఆయన పనైపోయిందని, ఇక బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునేదెవ్వరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ నేతలకే లేదన్నారు. “కేసీఆర్ కొడుకు పిరికిపంద. ఆయన అక్రమాలపై నేను మాట్లాడితే భయపడుతున్నడు. అందుకే నేను ఆయన గురించి మాట్లాడొద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నడు” అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు బండి సంజయ్.