హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తేలడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో మరో దొంగాటకు తెరదీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. వీవీ ప్యాడ్ పనిచేయడం లేదనే సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా కారులో ఎట్లా తరలిస్తారని ప్రశ్నించారు.
‘అసలు వీవీ ప్యాడ్ పనిచేయడం లేదనడానికి మీరు ఎవరు? అది పనిచేయడం లేదని మీరెలా నిర్దారించారు? ఎవరికి చెప్పకుండా ఎలా తరలిస్తారు? నిజంగా పనిచేయకపోతే పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? దీనిపై మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సిందే’’అని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల ముందు వీవీ ప్యాడ్లన్నీ స్ట్రాంగ్ రూంలో భద్రపర్చాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వీవీ ప్యాడ్ ను కారులో తరలించడమేంటని ప్రశ్నించారు. ఇఫ్పటికే భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కో ఓటుకు రూ.6 నుండి రూ.20 వేల వరకు పంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరివల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి తలెత్తింద్నారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని హుజూరాబాద్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చేలా ఓట్లు వేస్తే దీనిని కూడా అపహాస్యం చేసేలా సీఎం డైరెక్షన్ లో దొంగాట ఆడుతూ ఎన్నికల వ్యవస్థనే అవమానిస్తున్నారని మండిపడ్డారు.