ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిదని.. కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మీ సహా ప్రభుత్వ పథకాలేవీ వర్తించకపోవడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం కూడా కౌలు రైతులకు లేకపోవడం దారుణమని.. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకాకపోవడం బాధాకరమనీ ఆవేదన వ్యక్తం చేశారు.
భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా కౌలు రైతులకు భరోసా కల్పించేలా కౌలు చట్టంలో మార్పు తీసుకురావాలని 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అగ్రహించారు.
కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని నాబార్డు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. భూమిని సాగు చేసి పంట పండించే వాడే నిజమైన రైతు. అలాంటి రైతుకు బోనస్ సహా ఎరువులు, విత్తనాలతోపాటు వ్యవసాయ సబ్సిడీలన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని.. కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతు సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.