మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలు చేసేవారికి మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని బండి సంజయ్ తెలియజేశారు.
ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 21న నిర్వహించే మునుగోడు సభకు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టాగూడెంలో నిర్వహించిన భాజపా పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ సభకు వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రజల్ని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజల మీద నమ్మకంతో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని తెలిపారు. కేసీఆర్ ఇస్తానన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రాజెక్టులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారన్నారు.