టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపుతుంది. ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపిస్తున్నాయి. పేపర్ లీకేజీ ఘటనపై నేడు బిజెపి.. ధర్నా చౌక్ లో ” మా నౌకరీలు మాగ్గావాలే” అనే నినాదంతో మహధర్నా చేపట్టారు.
ఈ మహా ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి, డీకే అరుణ సహా పలువురు బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతుందని ఆరోపించారు.
పేపర్ లీక్ అయితే సీఎం స్పందించలేదని, ఆయన నిద్ర మత్తులో ఉన్నాడని విమర్శించారు. ” కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు బ్రోకర్, ఒకరు లిక్కర్, ఒకరు లీకర్. కెసిఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా..? డ్రగ్స్ కేసు, నయీమ్ కేసు పై వేసిన సిట్ నివేదికల్లో ఏం తేలింది? పేపర్లు లీక్ చేసే వాళ్ళని వదిలేసి మాకు నోటీసులు ఇస్తున్నారు” అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్.