భార్యలకు భర్త ఇచ్చే బహుమతులంటే ఎక్కడలేని ఆనందం ఉంటుంది. తమకు ఉన్నదాంట్లో భార్యాభర్తలు వారి వారి స్పెషల్ డేస్‌కు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. కానీ ఓ భర్త తన భార్యకు రూ. 90 వేలు ఖర్చుపెట్టి మోపెడ్ మోటార్ సైకిల్‌ను కొన్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారేమో.. వాళ్లిద్దరు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తారు. అడుక్కునే వాళ్లు ఇవ్వకూడదా అంటారేమో.. మీతో అంతా బాధే.. ప్రేమకు డబ్బుతో సంబంధం లేదు అని చెప్పడమే మా ఉద్దేశం.. ఇంతకీ అతను అంత డబ్బు ఎలా పోగుచేశాడు.. భార్యకు బైక్ ఎందుకు ఇచ్చాడో చూద్దామా..!
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని అమరవార గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ సాహు అతని భార్య మున్ని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.. సంతోష్‌కు అంగ వైకల్యం ఉన్న కారణంగా అతడు కాళ్ళు కదపలేడు. దాంతో సతీమణి మున్ని సాయంతో.. ఓ ట్రైసైకిల్ పై ప్రయాణిస్తూ బిక్షాటన చేసేవాడు. సంతోష్ ట్రైసైకిల్ పై కూర్చుంటే.. మున్ని సైకిల్ తోసేది. వృద్ధాప్యంలో ఉన్న అతని భార్య ఎండకు, వానకు అధ్వాన్నమైన రోడ్ల కారణంగా చాలా బాధపడేది. ఆమె పదే పదే అనారోగ్యానికి గురవుతుండేదట.
ఇటీవల సంతోష్ భార్య మున్ని తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన భార్య చికిత్స కోసం అతడు 50 వేల రూపాయలు ఖర్చు చేశాడు. చికిత్స అనంతరం మున్ని కోలుకున్నా.. బలహీనంగా తయారైంది. వెన్ను నొప్పి కూడా ఎక్కువైంది.. దాంతో ఆమె ట్రైసైకిల్‌ని తోయలేకపోయింది. భార్య కష్టం చూడలేక చలించిపోయిన సంతోష్.. తన భార్య కోసం ఓ బైక్ కొనాలకున్నాడు. నాలుగేళ్లుగా కష్టపడి పోగు చేసిన 90 వేల రూపాయలతో మోపెడ్ మోటార్ సైకిల్‌ను కొని తన భార్య మున్నికి బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఇద్దరం కలిసి హాయిగా బైక్‌పైనే వెళ్లి భిక్షాటన చేస్తున్నారు.
‘మోటార్ సైకిల్ రాకతో నా భార్యకు ట్రైసైకిల్ తోయాల్సిన అవసరం ఇక లేదు. ఇద్దరం కలిసి బైక్‌పైనే వెళ్లి భిక్షాటన చేస్తున్నామని సంతోష్ ఆనందంగా తెలిపాడు.. ఇద్దరు కలిసి సియోని, ఇటార్సి, భోపాల్, ఇండోర్‌లకు కూడా వెళ్తున్నారట. బైక్ కొన్న తర్వాత సంతోష్ వెళ్లి తనకు సాయం చేసిన వారికి స్వీట్స్ ఇచ్చాడు. అందరికీ కృతజ్ఞతలు కూడా తెలిపాడు.
సంతోష్ తన భార్యకోసం చేసిన ఈ పని చూసి.. నెటిజన్లు ప్రశంసలతో ముంచేస్తున్నారు. కొందరికి విపరీతంగా డబ్బు ఉంటుంది కానీ.. కట్టుకున్న భార్యపై కాసింతైన ప్రేమ ఉండదు. వాళ్లు ఆర్థికంగా డబ్బున్నవారు కావొచ్చు కానీ.. మానసికంగా పేదవారే.. మనల్ని నిస్వార్థంగా ప్రేమించే వారు పక్కనుంటే అదే మనకు కొన్ని కోట్లతో సమానం. కానీ ఈరోజుల్లో అలాంటి ప్రేమ దొరకడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ మీకు అలాంటి బంధం దొరికితే… చిన్న చిన్న కారణాలకు విడిపోవద్దుని మానసిక నిపుణులు ఎప్పుడూ అంటుంటారు.!
-Triveni Buskarowthu