వినాయక చవితి వచ్చిందంటే వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసి, గణనాథున్ని కొలుస్తారు. ధూప, దీప, నైవేద్యాలను సమర్పించడం, మండపాలు ఏర్పాటు చేయడం, వినాయకుడి ప్రతిమలను ఉంచడం, పూజలు చేయడం, నిమజ్జనం చేయడం చేస్తారు. అయితే ఇప్పుడు మనం వినాయకుడి తొండానికి సంబంధించిన ముఖ్య విషయం తెలుసుకుందాం.. మీరు గమనించే ఉంటారు.. కొన్ని వినాయకుని విగ్రహాల తొండం ఎడమవైపునకు, కొన్ని విగ్రహాల తొండం కుడివైపునకు, మరికొన్నింటి తొండం నిటారుగా ఉంటాయి.
మనం ఇంట్లో పూజలు చేసేవి, వీధుల్లో మండపాల్లో పెట్టే వినాయకుడి విగ్రహాల్లో వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఇక దేవాలయాల్లో, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టే విగ్రహాల్లో మాత్రమే వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉండడమో, లేదంటే నిటారుగా, స్ట్రెయిట్‌గా ఉండడమో కనిపిస్తుంది. అయితే ఈ మూడు వైపుల్లో ఒక్కో వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే ఒక్కో విధమైన ఫలితం కలుగుతుందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమ వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే
మన ఇండ్లలో, వీధుల్లో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలకు తొండం ఎడమ వైపుకు ఉంటుంది. అయితే ఇలా తొండం ఎడమ వైపుకు ఉన్న గణేషున్ని పూజిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుందట. ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్యం బాగుంటుందట. దీనికి తోడు గణేషుడి తల్లి అయిన పార్వతీ దేవి ఆశీస్సులు కూడా ఆ ఇంట్లోని వారందరికీ లభిస్తాయట. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందట.
కుడి వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే
దేవాలయాల్లో ప్రతిష్టించే గణేష్ విగ్రహాలకు తొండం ఇలా కుడివైపుకు ఉంటుందట. ఈ గణేషున్ని సిద్ధి వినాయకుడని పిలుస్తారట. ఇలాంటి గణేషున్ని పూజిస్తే మనం అనుకున్నది వెంటనే సిద్ధిస్తుందట. ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయంలో ఏది కోరినా వెంటనే జరిగిపోతుందనే ఓ నమ్మకం ఉంది. అందుకే అక్కడి వినాయకున్ని కోరిన కోర్కెలు తీర్చే వర సిద్ధి వినాయకుడని అందరూ పిలుస్తారు.
తొండం నిటారుగా ఉన్న గణేషున్ని పూజిస్తే
తొండం నిటారుగా ఉన్న గణేషుడి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయట. ఇలాంటి ఆకారంలో ఉన్న వినాయకున్ని పూజిస్తే జీవితంలో అనుకోని విధంగా గొప్ప కార్యాలు నెరవేరుతాయట.