దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి లేదని బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. అందులో నుంచి జేడీయూ, శిరోమణి అకాలీదళ్, శివసేన పార్టీలు బయటకు వచ్చాక ఇంకా ఎన్డీఏ ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీ తప్పుడు వాగ్దానాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ కాదని.. పెద్ద అబద్దాల పార్టీ (బడ్కా ఝుఠా పార్టీ) అని అన్నారు.
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఆ పార్టీలు ఎన్డీయే కూటమిని వీడాయని అన్నారు. ఇటీవల బిహార్ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. పుర్నియాలో విమానాశ్రయం గురించి మాట్లాడారని.. వాస్తవానికి అక్కడ విమానాశ్రయమే లేదన్నారు.
వేదికపైనున్న జేడీయూ నేత నీతీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ సుఖ్‌బీర్ సింగ్‌బాదల్, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పేర్లను ప్రస్తావించిన తేజస్వి యాదవ్.. వీరంతా గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నావారేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఆ కూటమి నుంచి వీరంతా బయటకు వచ్చారన్నారు. ఇటువంటి సమయంలో ఇంకా ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు.