నవ్వులోనూ ఏడుపులోనూ ఏ భావోద్వేగంలో అయినా మన బ్రహ్మీ ఒదిగిపోతారు.నవ్వించడం అనే బృహత్తర కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నాన్ స్టాప్ గా నడపడం ఆయనకే సాధ్యం.ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా పలికించడం కూడా ఆయనతోనే సాధ్యం.మనల్ని నవ్విస్తూ,నవ్వులు అందిస్తూ ప్రతిరోజూ బ్రహ్మోత్సవం తరహాలో వేడుకుల చేసుకోవాలి ఆయన.
ఆ పండగ సంతోషాల్లో మనమంతా ఉండాలి..ఇవీ ఇవాళ్టి కోరికలు.ఇవాళ్టి ఆశలు..ఆయన విషయమై మనలో మెదిలివి..కలిగేవి..ఊహకు అందేవి..హాయిగా ఉండేలా చేసేవి కూడా! చారీ గారు ఎక్కడో రావు గారు ఎక్కడో .. ఆ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీలా ఆ గొడవేమిటో.. ఇదంతా ఢీ సినిమా అప్పుడు నడిచిన ట్రాక్.ఈ సినిమాతో బ్రహ్మీ కెరియర్ మారిపోయింది.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చాలా సినిమాలు అలానే నడిచాయి.
ఆ తరువాత కూడా చారీ క్యారెక్టర్ తో అదుర్స్ లో అలరించారు.అంతకుముందు కూడా బ్రహ్మీకి మంచి క్యారెక్టర్లే వచ్చాయి. ఆయన స్థాయిని ఒక్కసారిగా పెంచాయి.ఇవాళ బ్రహ్మీ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి కొంత!
మనం రోజూ నవ్వుకునే నవ్వులలో అతనిని ఇన్వాల్వ్ చేయకుండా ఉండలేం.మన నవ్వుల్లో నవ్వు..మన వెక్కిరింపుల్లో వెక్కిరింత..కేరింతల్లో కేరింత..మన పెదవి విరుపుల్లో విరుపు..అన్నీ ఆయనే!అంతగా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.నవ్వించాలన్నా,సీరియస్ గా ఉంటూనే కామెడీ పండించాలన్నా ఆయన తరువాతే ఎవ్వరైనా!
జంద్యాల దగ్గర నుంచి నిన్న మొన్నటి దర్శకుల వరకూ ఆయన టైమింగ్ ను ఇష్టపడని డైరెక్టర్లు లేరు.సినిమాలలో ఎంత హాయిగా నవ్విస్తారో, బయట అంత కన్నా అద్భుతంగా ప్రసంగిస్తారు.సాహిత్య ధోరణులను విశ్లేషిస్తారు.పద్య సాహిత్యాన్ని అలవోకగా పలికి తెలుగు వారికే సొంతమైన పద్య వైభవాన్ని చాటుతారు. తెలుగు లెక్చరర్ గా కెరియర్ ప్రారంభించి,అనూహ్యంగా సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం రంగ మార్తాండలో నటిస్తున్నారు.ఈ సినిమాను కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
వారెవ్వా ఏమి ఫేసు అంటూ అప్పుడెప్పుడో నవ్వించాడు.అమితాబచ్చన్ కన్నాతానేం తక్కువ కాదని ఫీల్ అయిపోయాడు.. ఖాన్ తో గేమ్స్ ఆడొద్దని..శాల్తీలు లేచిపోతాయని వార్నింగులు ఇచ్చాడు.ఆ విధంగా స్టేజ్ మీద ఉన్నంత సేపూ నవ్వించాడు. ఆ విధంగా ఫ్రేమ్ లో ఉన్నంత సేపు కూడా నవ్వించాడు.నవ్విస్తూనే ఉన్నాడు.నవ్వుల విలువ చాటి చెబుతూనే ఉన్నాడు.తెర ముందు,తెర వెనుక నవ్వించడం తప్ప మరో పని చేతగాదు ఆయనకు.