కేసీఆర్‌ని రౌండప్ చేసిన కమలదళం..! 

-

అదేదో రాజులు యుద్ధం మాదిరిగా…శత్రువులని ఊపిరి సలపకుండా…దాడులు చేసినట్లుగా..అన్నీ వైపులా నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎటాక్ మొదలుపెట్టింది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కమలదళం ముందుకెళుతుంది. అసలు ఏదైనా ఒక విషయంపై బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్లు ఇచ్చే లోపు…మరొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి కమలం నేతలు చుక్కలు చూపిస్తున్నారు.

ఇప్పటికే విజయ్ సంకల్ప్ సభ తర్వాత బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళుతుంది. ఓ వైపు సంస్థాగతంగా బలపడుతూనే మరోవైపు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతున్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి లెక్కలని తేల్చుతానని చెప్పి బండి సంజయ్ సరికొత్త రూట్ లో వెళుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ పై బండి ఆర్టీఐ అస్త్రం సంధించారు. దాదాపు 80కి పైగా దరఖాస్తులు అప్లై చేశారు.

కేసీఆర్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు? ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారు? ప్రగతిభవన్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత? ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎన్ని భర్తీ చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలని బండి ఆర్టీఐకి సంధించారు. అలాగే ఇంకా పలు అంశాల గురించి తెలుసుకునేందుకు ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్య నేతలు సైతం దరఖాస్తులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమాచారాలని ఎలాగైనా తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక అదే సమయంలో నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ లో ఉన్న బలమైన నేతలని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలని సైతం లాగేందుకు చూస్తున్నారు. అలాగే ప్రతిరోజూ ప్రజల మధ్యలో ఉంటూ…వారి సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు..అదేవిధంగా టీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలని సైతం వెలికి తీస్తామని కమలం నేతలు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని కమలదళం గట్టిగానే రౌండప్ చేసినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news