ఇటీవలి కాలంలో రైళ్లు, ఎయిర్ పోర్ట్స్, విమానాలకు బాంబు బెదిరింపులు కామన్ అయిపోయాయి. గుర్తుతెలియని ఐడీల నుంచి మెయిల్స్ రావడం, మరికొన్ని ఘటనల్లో ఏకంగా ఎయిర్ పోర్టుకు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఇలా బాంబు బెదిరింపుల కారణంగా అటు ఎయిర్ పోర్టు అథారిటీస్‌తో పాటు ప్యాసింజర్స్ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పౌరసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఈ క్రమంలోనే ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం AI119కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో పైలట్లు ఆ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు పెట్టినట్లు సోషల్ మీడియాలో బెదిరింపు రావడంతో సెక్యూరిటీ రెగ్యులేటరి కమిటీ సూచనలతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. ప్రస్తుతం 239 మంది ప్రయాణికులు ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం.