టీడీపీ, బీజేపీ నేతలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన బొత్స.. ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటున్నామని, వారికి ఏమైనా కష్టాలు ఉన్నాయీ అంటే అవి కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెట్రోలు, డీజిల్ ధరలవల్లేనని చెప్పారు. వీటివల్ల దేశమంతా ఇబ్బంది పడుతోందన్నారు. అలాగే, చంద్రబాబు చేస్తున్న ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలపైనా స్పందించారు బొత్స.
ప్రజలు ఐదేళ్లూ పాలించమని తమను గెలిపించారని, కాబట్టి ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయని బొత్స ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు కావాల్సింది చంద్రబాబుకేనని విమర్శించారు బొత్స. ఈ విషయంలో తమ పార్టీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కానీ, అలా చెప్పడానికి చంద్రబాబు ఎవరని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని శ్రీలంతో పోల్చడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషనైపోయిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే అలా అయిందని, కానీ ఇక్కడ బలమైన నాయకత్వం ఉందని, పార్టీకి ఓ విధానమంటూ ఉందని పేర్కొన్నారు బొత్స.