తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ 2+2 గన్‌మెన్‌లు కలిగిన రోహిత్ రెడ్డికి.. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ జారీచేసింది హోంశాఖ. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పైలెట్ రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.