ఆ వీర్యానికి భారీ డిమాండ్.. అందుకే, దాని ధర రూ.24కోట్లు!!

ఆ వీర్యానికి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే, దానికి భారీ డిమాండ్. డిమాండ్ అంటే అంతా ఇంతా కాదండి. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు. ఐదారు దేశాల నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయి. వీర్యం ఏమిటి? డిమాండ్ ఏమిటి? విదేశాల నుంచి ఆర్డర్లు ఏమిటి అనుకుంటున్నారా? అయితే చదవండి.

రాజ‌స్థాన్ రాష్ట్ర అజ్‌మేర్‌‌లో పుష్కర్ ఫెయిర్ నిర్వహించారు. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఓ దున్న. ముర్రా జాతికి చెందిన ఆ దున్న ఎత్తు ఆరడుగులు. పొడువు 14 అడుగులు. బరువు 1500 కిలోలు. దానిని జవహర్‌లాల్‌ జాంగీడ్ అనే వ్యక్తి ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. ఆ దున్నను భీమ్ అని పిలుచుకుంటామని, దాని ఖరీదు రూ.24కోట్లు అని తెలిపారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో విక్రయించే ప్రసక్తే లేదని చెప్పారు. దానికీ ఓ కారణం ఉంది.

భీమ్ సంతతిని ఉత్పత్తి చేయాలనుకున్న వారు దాని వీర్యం తీసుకెళ్తుంటారు. ఆ వీర్యం ద్వారా వచ్చే ఆదాయమే రూ.కోట్లలో ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుండటంతో వీర్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది. వీర్యం ద్వారానే రూ.కోట్లలో ఆర్జిస్తుండటంతో జవహర్ అమ్మే ప్రసక్తే లేదంటున్నారు.