కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఎన్సీపీ పార్టీలకు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి శుభవార్త చెప్పింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చింది.
అంతేగాక, ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే, గుజరాత్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి అర్హతను అందుకుంది. ఇక మరోవైపు, ఇతర రాష్ట్రాల్లో ఓట్లను సాధించడంలో విఫలమైన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) జాతీయ పార్టీ హోదాలను కోల్పోవడం గమనార్హం.