థాయిలాండ్ దేశం గంజాయి సాగులో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు థాయిలాండ్ దేశం ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది థాయిలాండ్. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం.. దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది.
దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది థాయిలాండ్ ప్రభుత్వం. కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని థాయిలాండ్ ప్రభుత్వం విడుదల చేయనుంది. గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు, నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.