ఏపీ రాజధాని అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విశాఖలో భూ స్కామ్ లపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరుగుతున్న సిపిఐ జాతీయ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే ఆనాడు జగన్ ఆమోదం తెలిపారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని మండిపడ్డారు.
మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని వ్యాఖ్యానించారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని వెల్లడించారు. బిడ్డకు మూడేళ్లు వచ్చినా తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అని అభివర్ణించారు నారాయణ. మరోవైపు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ రెడ్డికి ఎందుకు అంత భయం? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.