కేంద్రం అలర్ట్ : పంద్రాగస్టు నాడు గుమిగూడొద్దు

-

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరింది. వ్యాధి సంక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని కొవిడ్‌ నియమాలను పాటించాలని పేర్కొంది.

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా 15వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం 3.04 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,561 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 5.44 శాతంగా నమోదైంది. నిన్న 49 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని దిల్లీలో అత్యధికంగా 2,726 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివిటీ రేటు 14.38 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో దిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారు మాస్కులు కచ్చితంగా ధరించాలని గతవారమే ప్రజలను ఆదేశించింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు.. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 7,70,436 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,724 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,29,36,079కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,45,795 మంది మరణించారు. ఒక్కరోజే 9,68,940 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,48,72,103కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version