ప్రముఖ సినీ నటుడు నిర్మాత చలపతిరావు ఈరోజు ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చలపతిరావు.. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన ఉన్నట్టుండి మరణించారు అని వైద్యులు నిర్ధారించారు. అయితే డిసెంబర్ 23న ప్రముఖ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణం మరువకముందే ఇప్పుడు దిగ్గజ నటుడు చలపతిరావు ఈరోజు అనగా డిసెంబర్ 25న మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. చలపతిరావు మరణాన్ని అటు సినీ ప్రేమికులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
79 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడం నిజంగా అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది. వయోభారం రీత్యా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన తాజాగా గుండెపోటుతో మరణించారు. ఇకపోతే గతంలో చలపతిరావు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండేవారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో తన కుమారుడు రవిబాబు నివాసంలోనే ఉంటున్నారు. రవిబాబు హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే చలపతిరావుకు రవిబాబుతోపాటు ఇద్దరూ కూతుర్లు కూడా ఉన్నారు.
ప్రస్తుతం కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో ఉన్న విషయం తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వృత్తిరీత్యా అమెరికాలో వీరు నివాసం ఉన్నారు. వారు వచ్చిన తర్వాతనే చలపతిరావు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రవిబాబు బుధవారం రోజున మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ పెద్దల సందర్శనార్థం తన నివాసంలో ఉంచిన రవి బాబు ఆ తర్వాత పార్తివదేహాన్ని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో ఉంచుతామని వెల్లడించారు. కూతుర్లు వచ్చిన తర్వాతనే చలపతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి.