వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై తేలిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాగా, సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆసుసత్రి వద్దకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో టీడీపీ నేతలపై పోలీసుల వైఖరి దారుణమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ మృతి కేసులో నిజానిజాలు తేలాలని డిమాండ్ చేశారు. హత్య కేసు నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రధాన నిందితుడు అనంతబాబును అరెస్ట్ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.