రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నేతల గ్రాఫ్ పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని స్థానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. ఓ వైపు అసెంబ్లీ ఇంచార్జులతో రెండో దఫా రివ్యూలు… మరోవైపు ఆయా స్థానాల్లో ఇంచార్జుల నియామకాన్ని చంద్రబాబు వేగవంతం చేశారు. ఇటీవల జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వీఎం థామస్, పూతలపట్టుకు కలికిరి మురళీ మోహన్‌ను నియమించారు.
ఇక, పార్టీలో చేరికలు, భవిష్యత్తుపై గ్యారెంటీ కార్యక్రమంపైనా చంద్రబాబు నేతలతో చర్చించారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు నూతన ఇన్చార్జిల నియామకంపైనా కసరత్తు చేశారు. ఇప్పటికే 43 మంది ఇన్చార్జిలతో చంద్రబాబు ఒక్కొక్కరితో విడిగా సమావేశమయ్యారు. కాగా, జులై రెండోవారం నుంచి చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో పాటు యువగళం కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా టీడీపీ వర్గాలు రూట్ మ్యాప్ ను రూపొందించనున్నాయి.