తస్సాదియ్యా! ఉద్యమాలను అణిచేయాలన్నా.. చంద్రబాబే.. ఉద్యమాలు చేయాలన్నా.. చంద్రబాబే..!! రెండు రోజుల కిందట ఓ కీలక నాయకుడు(ప్రస్తుతం తటస్థంగా ఉన్నాడు లేండి) అన్నమాటలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అక్షరాలా నిజం చే సేస్తున్నారు. అలుగుటయే ఎరుంగని.,. అన్నట్టుగా ఉద్యమాలు, నిరసనలు అంటేనే గిట్టని చంద్రబాబు ఇప్పుడు ఉద్యమ బాబు గా మారిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు.. అసలు ఉద్యమాలతో ఏం వస్తుంది? శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రకు ప్రతిపక్షాలు పూనుకుంటున్నాయని ప్రకటించిన బాబుగోరు.. ఇప్పుడు అధికారంలో నుంచి దిగిపోగానే ఉద్యమాలే ఊపిరిగా బతికిన కమ్యూనిస్టులను మించిపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఒకటి కాదు .. రెండు కాదు.. అనేక ఉద్యమాలు ఈ ఆరేడు మాసాల్లో రాష్ట్రంలో జరిగాయంటే .. అతిశయోక్తి అనిపించకమానదు. తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఉద్యమాలు ప్రారంభించిన చంద్రబాబు.. ఇసుక కొరత సహా ఉల్లిపాయల ధరలపై ఉద్యమాలు చేశారు. ఇక, మద్య నియంత్రణ పేరుతో మద్యం ధరలను పెంచుతారా? అని ప్రశ్నించారు. అదేసమయంలో రివర్స్ టెండర్లు వద్దని నినదించారు. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు నీటిని వదిలి పెట్టకుండా తన ఇంటిని ముంచేందుకు ప్రయత్నించారని అన్నారు.
తాను కట్టించిన భవనాన్ని కూల్చేశారని రోడ్డెక్కారు. అంతేకాదు, గోదావరి జలాలను కేసీఆర్‌కు ఇచ్చేస్తున్నారని, అసలు కేసీఆర్‌తో జగన్ సంబంధాలు ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో పోర్టుల్లో కేసీఆర్‌కు భాగస్వామ్యం ఇస్తున్నారని ఇది ఆంధ్రను పాడుచేయడమేనని చెప్పారు. ఇక, ఇప్పుడు కీలకమైన రాజధాని అమరావతిని తరలించేస్తారా? అంటూ గడిచిన 20 రోజులుగా అనేక రూపాల్లో ఆయన ఉద్యమాన్ని తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జోలె పడుతున్నారు. ఇక, న్యూఇయర్ రోజు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతిని కూడా వదులుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు మిస్డ్ కాల్ ఉద్యమం అంటూ కొత్తగా ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
8460708090 ఫోన్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అమరావతి ఉద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను అభ్యర్ధించారు. నిజానికి చంద్రబాబు ఉద్యమం మంచి రేంజ్‌లో సాగుతుంటే ఈ మిస్డ్ కాల్ ఉద్యమం ఎందుకో? అనేది మేధావుల ప్రశ్న. ఉద్యమాలు సరిగా సాగకపోయినప్పుడు.. ప్రజలను భాగస్వామ్యం చేయాలని భావించినప్పుడు మాత్రం ఈ తరహా జిమ్మిక్కులు తెరమీదికి వస్తాయి. మరి బాబు ఇచ్చిన ఈ పిలుపుతో అమరావతి ఉద్యమం అనుకున్న రేంజ్‌లో సాగడం లేదని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఏమంటారో?!!