బాబు గారూ.. మీ జూమ్ కళ్లద్దాలు తీసి చూస్తే అర్థమవుతుంది : మంత్రి వెల్లంపల్లి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గవర్నర్ వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష టిడిపి పార్టీ తీవ్ర స్థాయిలో అధికార వైసిపి పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని… రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటూ విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు గారు ఇప్పటికైనా మీ జూమ్ కళ్ళద్దాలు తీసి చూస్తే ఏం జరుగుతుంది అన్నది అర్థం అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబు కలలు సాకారం కావాలంటే ప్రకటనలు చేయడం మాత్రమే కాదు ఆ దిశగా అందరూ పాటుపడాలి అనేది మీ పార్టీ ఎంపీ నాని ప్రత్యక్షంగా చెబుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి వెల్లంపల్లి. ఇప్పటికైనా జగన్ సర్కార్ పై అనవసర విమర్శలు మాని.. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరించాలని అంటూ వ్యాఖ్యానించారు. లేదంటే మీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజల తీర్పు కోరాలి అంటూ డిమాండ్ చేశారు మంత్రి వెల్లంపల్లి.