హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సెంట్రల్ కార్యాలయంలో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ‘చరిత్రపుటల్లో తెలంగాణ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో రూపుదిద్దుకుంది. అయితే ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ చరిత్రను, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలను, పోరాటాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, జాతరలను ఈ పుస్తకంలో పొందుపరిచారంటూ ప్రొఫెసర్లను కొనియాడారు కేటీఆర్. అంతేకాకుండా.. మతం రాజకీయ పార్టీ ముసుగులో రంగప్రవేశం చేస్తే దేశం అయోమయానికి గురవుతుందన్నారు మంత్రి కేటీఆర్.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఎప్పుడూ ఉంటారన్న కేటీఆర్.. ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎదురుతిరగడంతో దేశంలో మరిన్ని గొంతుకలు ఆయన బాటలో ఎలుగెత్తుతాయని వివరించారు మంత్రి కేటీఆర్. మత్తుమందులా తయారైన మతం పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, యువత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే కులం, మతం పేరిట కొట్లాడుకునే విష వలయాల్లో చిక్కుకునే ప్రమాదముందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.