తిరుమల ఘాట్ రోడ్ లో చిరుతపులి భక్తులపై దాడి చేసింది. ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణ లు రెండో ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తుండగా వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత పులి ఇద్దరి పై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఇద్దరు కేకలు వేయడం తో చిరుత అక్కడ నుండి పరిగెత్తింది. బైక్ పై ఇద్దరూ వెళ్తున్న సమయంలో చిరుత రోడ్డు దాటుతుండగా వారిపై దాడి చేసినట్టు వీజీవో బలారెడ్డి పేర్కొన్నారు.
అంతేకాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైందని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పులి దాడి లో గాయపడిన ఆనంద్ రామకృష్ణ లను విజిలెన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇక ఘాట్ రోడ్డులో చిరుత దాడి కలకలం రేపింది. దాంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషాన ఎటు వైపు నుంచి చిరుత వస్తుందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇక గతంలో కూడా చిరుత రోడ్డు పై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.