షాకింగ్‌ : చైనా మాజీ అధ్యక్షుడికి అవమానం.. అందరూ చూస్తుండగానే

-

చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోకు ఘోర పరాభవం జరిగింది. మీడియా కళ్లముందే ఆయనను సమావేశం జరుగుతున్న హాలు నుంచి గెంటివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమ్యూనిస్టు పార్టీ ముగింపు సమావేశం సందర్భంగా ఈ ఘటన జరిగింది. హు జింటావోకు ఎదురైన అవమానం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై పలు ప్రశ్నలు రేకెత్తగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. సమావేశ మందిరంలో ముందు వరుసలో కూర్చున్న జింటావో వద్దకు ఇద్దరు వచ్చి మాట్లాడడం, ఆ వెంటనే ఆయన వారితోపాటు బయటకు వెళ్లిపోవడం వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ పక్కనే కూర్చున్న జింటావో అయిష్టంగా లేచి వెళ్లడం గమనార్హం.

చైనా అధికారిక మీడియా జిన్హువా మాత్రం.. 79 ఏళ్ల జింటావో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకనే లేచి వెళ్లిపోయారని పేర్కొంది. పార్టీ 20వ నేషనల్ కాంగ్రెస్ ముగింపు సమావేశానికి హాజరైన జింటావో అనారోగ్యంతో బాధపడుతుండడంతో విశ్రాంతి కోసం ఆయనను పక్కనే ఉన్న గదిలోకి సిబ్బంది తీసుకెళ్లారని జిన్హువా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. అనారోగ్యం నుంచి జింటావో పూర్తిగా కోలుకోకున్నా పట్టుబట్టి మరీ సమావేశానికి హాజరయ్యారని జిన్హువా పేర్కొంది. సమావేశం మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సిబ్బంది విశ్రాంతి కోసం పక్క గదిలోకి తీసుకెళ్లారని వివరించింది. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version