పెలోసీ పర్యటనపై అమెరికాకు చైనా వార్నింగ్

-

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన చైనా, యూఎస్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ పర్యటనలో భాగంగా పెలోసీ తైవాన్‌కు వెళ్లనున్నట్లు వస్తోన్న వార్తలే అందుకు కారణం. ఈ వార్తలపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న డ్రాగన్.. తాజాగా అగ్రరాజ్యాన్ని గట్టిగా హెచ్చరించింది. పెలోసీ తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా మూల్యం చెల్లించక తప్పదని చైనా గట్టిగా హెచ్చరించింది.

‘‘చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించేలా పెలోసీ వ్యవహరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించాలి. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

తైవాన్‌ దేశాన్ని తమ భూభాగంగానే పరిగణిస్తోన్న చైనా.. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. పెలోసీ తైవాన్‌లో అడుగుపెడితే అది రెచ్చగొట్టే చర్యే అవుతుందని, అది చాలా ప్రమాదకరమని పేర్కొంది. ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌ కాల్‌లో మాట్లాడుతూ ఈ విషయంపై గట్టిగానే హెచ్చరించారు.

చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ఆమె తైవాన్‌ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని తెలిపింది. అయితే పెలోసీ మాత్రం తైవాన్‌కు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె మలేసియాలో ఉన్నారు. ఈ రాత్రికి ఆమె తైపే నగరానికి చేరుకునే అవకాశాలున్నాయని పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

దీంతో అమెరికా అప్రమత్తమైంది. తైవాన్‌ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్‌ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ క్యారియర్‌ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని సదరు కథనం పేర్కొంది. తైవాన్‌కు తూర్పువైపున ఈ యుద్ధ నౌకలు మోహరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version