ట్రాన్స్ జెండర్ పర్సన్ యాక్ట్ 2019ప్రకారం భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగా హైదరాబాద్ లో రెండు ట్రాన్స్ జెండర్ క్లినిక్స్ ప్రారంభించింది. హైదరాబాద్ ట్రాన్స్ జెండర్లలో హెచ్ఐవీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున, ఈ నగరాన్ని ప్రారంభం బిందువుగా ఎంచుకున్నట్లు ట్రాన్స్ కార్యకర్త ముద్రబోయిన రచన తెలిపారు.
హైదరాబాద్ ట్రాన్స్ జెండర్లలో హెచ్ఐవీ జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని, జాతీయ సగటు 3.13గా ఉంటే, హైదరాబాద్ లో 6.47గా ఉందని, ఇది చాలా ఎక్కువ అని రచన ముద్రబోయిన అన్నారు. ఈ నేపథ్యంలో అటు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID), నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) సాయం అందిస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ ట్రాన్స్ జెండర్లలో హెచ్ఐవీని నివారించడానికి ఇంకా యాంటీరిట్రోవైరల్ థెరపీ సేవలను ఉపయోగించుకునేందుకు ట్రాన్స్ జెండర్ క్లినిక్ సాయపడుతుందని అన్నారు. మొత్తం రెండు క్లినిక్ లలో ఒకటి నారాయణ గూడలో ప్రారంభం కాగా మరోటి జీడిమెట్లలో తెరుచుకుంది. ఈ క్లినిక్ పూర్తిగా ట్రాన్స్ జెండర్లచే నడపబడుతుంది. అలాగే ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలు, జోగినులు, శివశక్తులు ఇక్కడకు రావచ్చు.
ఈ క్లినిక్ లో సాధారణ ఆరోగ్య సేవల నుండి హార్మోన్ థెరపీ, మానసిక ఆరోగ్యానికి సలహాలు, హెచ్ఐవీ/ ఎయిడ్స్ పై కౌన్సిలింగ్, నివారణ, చికిత్స, ఇంకా చట్టపరమైన సలహాలు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.