ఏపీలో కాలేజీలకు షాక్‌.. న్యాక్ గుర్తింపు సాధించాల్సిందే

-

ఏపీ సర్కార్‌ కాలేజీలపై కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్లల్లో న్యాక్‌ గుర్తింపు సాధించకపోతే కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి కళాశాలలో బోధన, వసతుల్లో నాణ్యత పెరగాలని, ప్రతి విద్యా సంస్థ న్యాక్‌ గుర్తింపు సాధించాలని సూచించారు. మూడేళ్లల్లో కళాశాలలు ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘కళాశాలలు న్యాక్‌ గుర్తింపు సాధిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కళాశాలల అనుమతుల్లో ఒకే విధానం ఉండాలి. బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు తిరుపతి, విశాఖపట్నంలోని అకడమిక్‌ స్టాఫ్‌ కళాశాలలను బలోపేతం చేయడంతోపాటు సెంట్రల్‌ ఆంధ్ర పరిధిలో మరొక అకడమిక్‌ స్టాఫ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. ట్రిపుల్‌ఐటీల్లో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను వెంటనే పరిష్కరించాలి’ అని ఆదేశించారు.

‘విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంపై ఆలోచించాలి. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని జూన్‌ నాటికి నియామక ప్రక్రియ ప్రారంభించేలా చూడాలి. సిబ్బంది భర్తీ త్వరగా జరగాలి. డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాలను పెంచాలి. విదేశాల్లో అందిస్తున్న కోర్సులను పరిశీలించి, వాటిని ఇక్కడి వారికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రఖ్యాత కళాశాలల కరిక్యులమ్‌ మన దగ్గర అమలయ్యేలా చూడాలి. ఐటీ, నైపుణ్యాభివృద్ధిశాఖలు కలిసి దీనిని రూపొందించాలి. పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news