ఏపీలోని కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో వివిధ బ్యాంకులు అందిస్తున్నతోడ్పాటు అభినందనీయమైనదని రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) 220 వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఎసిపి)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి,వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కావున రైతులకు వ్యవసాయ పంట రుణాలు,ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.అలాగే ఎంఎస్ఎంఇ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కావున ఆరంగంలో కూడా బ్యాంకులు తమవంతు తోడ్పాటును అందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు.టిడ్కో గృహాలు,ఇతర గృహనిర్మాణ పధకాల లబ్దిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు.స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పారు.