ఇవాళ రెండోరోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం.. ప్రేయర్ హాల్‌లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. నూతనంగా నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ బస్టాండ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇక రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న జగన్‌మోహన్ రెడ్డి.. కడప జిల్లాలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూనే.. రాష్ట్ర ప్రజలు అంటే తనకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ఇదే నా రాష్ట్రం. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం. ఏపీ ప్రజల సంక్షేమమే నా విధానం. నేను ప్రజలనే నమ్ముకున్నాను. చంద్రబాబులా దత్తపుత్రుడిని, మీడియాను నమ్ముకోలేదు. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అని.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని నేను అనడం లేదు’ అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
‘చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం.. ఇక్కడి ప్రజలపైనే నా మమకారం. ఇక్కడ ఉన్న 5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ఇక్కడే నా రాజకీయం. ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని గట్టిగా నినదిస్తున్నాను. తేడా గమనించమని చెబుతున్నాను. ఎన్నికలప్పుడు మాయ మాటలు చెబుతారు. వారంతా కూడా మ్యానిఫెస్టో ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత ఆ బుక్‌ను చెత్తబుట్టలో వేశారు’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.