తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తోన్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలు, ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలను కేసీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
‘కర్ణాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటించారు. పైసలు లేవ్.. ఏం చేద్దాం.. ఎస్టీ, ఎస్టీఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్ధానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి. చేయగలిగిందే చెప్పాలి. చెప్పింది చేయాలి ఈ పద్ధతి ఉండాలి. నాలుగు ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి.. అలవికాని హామీలు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇచ్చే పెన్షన్ ఎంత ? రాజస్థాన్‌లో ఇచ్చేదెంతా?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4వేలు పెన్షన్ ఇస్తరా? ప్రజలను అడిగితే చెప్పారు. చేత్తమంటున్నరు వస్తరా అంటే యాళ్లకు లావడితే ఎట్ల అంటున్నరు. ఇంతకు ముందు అనుభవాలు ఉన్నాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘భారత్‌లో అత్యధికంగా సాలరీలు పొందేది తెలంగాణ ఉద్యోగులు. ఉద్యమ సమయంలో నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పాం.. మాటను నిలబెట్టుకున్నాం. మాకు మానవీయ దృక్పథం ఉన్నది. కాంగ్రెస్, మరెవరి పార్టీలో ఇవ్వలేదు. 30శాతం పీఆర్సీ ఉద్యోగులకు ఇస్తే.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం 30శాతం జీతాలు పెంచాం. భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి పెంచడం. శాసనసభలో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పెంచాం. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. తక్కువ సమయంలో పీఆర్సీ అపాయింట్ చేస్తాం. మా ఉద్యోగులు చమటోడుస్తున్నరు. మా ఇంజినీర్ల పుణ్యం ప్రాజెక్టుల్లో నీళ్లు కనబడుతున్నయ్. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యంతో వనాలు పెరుగుతున్నయ్. వ్యవసాయ అధికారుల పుణ్యంతో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది’ అన్నారు.