తెలంగాణ హైకోర్టు ప్రాంగణం నుంచి 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్‌తో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా మంచి దినం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఒకసారి తెలంగాణ హైకోర్టు ప్రారంభోత్సవానికి వచ్చానని, ఇప్పుడు మళ్లీ 33 జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనంలో ఉందని, చాలా అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు కేసీఆర్. రాష్ట్రం ఉజ్వలంగా దేదీపమాన్యంగా దూసుకుపోతోందన్న కేసీఆర్.. ఎన్వీ రమణ ఇదే హైకోర్టులో పని చేసినటువంటి ఈ గడ్డబిడ్డ అని కొనియాడారు. వారు ఎంతో పెద్ద మనసుతో కేంద్రంతో మాట్లాడి మన హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారని, వెంటనే నియామకాలు చేపట్టి, ఒక పటిష్టమైన కోర్టుగా రూపుదిద్దుకున్నామన్నారు కేసీఆర్.
లోయర్ జ్యుడిషీయరీలో పటిష్టత కోసం ఇటీవలి కాలంలో న్యాయశాఖ అధికారులతో మే సుదీర్ఘమైన భేటీ నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, జిల్లా కోర్టులు కావాలని కోరిన వెంటనే సీజే అంగీకరించి.. ఏర్పాటు చేశారన్నారు. ఇవాళ జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమని, సెషన్స్ కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని, ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనలో సంస్కరణలను అమలు చేశామన్నారు.