ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆయన మహబూబాబాద్ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో మహబూబాబాద్ చేరుకోనున్నారు. ప్రభుత్వ శాఖలన్నీ.. ఒకే చోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించాలన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో నూతన సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. మహబూబాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 58 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది.
మహబూబాబాద్ పర్యటన ముగించుకుని.. మధ్యాహ్నం ఒకటిన్నరకు హెలికాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ నేటి నుంచే సరికొత్త పాలన అందించేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్ ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్‌ను కొత్త కలెక్టరేట్ ఛాంబర్‌లో కూర్చోబెడతారు. అనంతరం కలెక్టరేట్ లోని గదులు, పలువురు అధికారుల ఛాంబర్లు పరిశీలిస్తారు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.