దామరచర్లలో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు దేశం కీర్తి ప్రతిష్ఠలు పెంచుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వ రంగంలోనే దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రయివేటు, కార్పొరేట్ల ఒత్తిడికి లొంగకుండా ప్రభుత్వ రంగంలోనే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్లాంట్ ఆపరేషన్‌కు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బొగ్గు నిల్వలు సహా ఇతర ఆపరేషన్ విషయంలో అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని సూచించారు. పవర్ ప్లాంట్‌కు ప్రతి రోజు అవసరమయ్యే బొగ్గు, నీరు వివరాలపై సీఎం ఆరా తీశారు. నీటి సరఫరాకు కృష్ణా నీటిని సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకుని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించేందుకే దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేశామని తెలిపారు.